రుషికొండ ప్యాలెస్ గురించి తెలుసు కానీ ఈ డాంకీ ప్యాలెస్ (Donkey Palace) ఏంటి కొత్తగా అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. ఇటీవల తెలుగురాష్ట్రాల్లో గాడిద పాల ఉత్పత్తి పేరుతో జరిగిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. చెన్నైకి చెందిన ఓ సంస్థ ఏపీ, తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల రైతులను ఘోరంగా బురిడీ కొట్టించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో రూ.100 కోట్లకు పైగా మోసానికి పాల్పడినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గాడిద పాల ఉత్పత్తి పేరుతో మోసపోయిన రైతులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం…
‘డాంకీ ప్యాలెస్’ (Donkey Palace) అనే చెన్నై సంస్థ ఒక్కో గాడిదను రూ.1.5 లక్షలకు తమకు అమ్మిందని, లీటర్ గాడిద పాలను రూ.1,000కి కొనుగోలు చేస్తామని చెప్పి మోసం చేసిందని బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. నమ్మకం కలిగించేందుకు మూడు నెలల పాటు గాడిద పాలను కొనుగోలు చేశారు. అనంతరం 18 నెలలుగా గాడిద పాలకు డబ్బులు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ‘డాంకీ ప్యాలెస్’ సంస్థ తమకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని రైతులు వాపోయారు.
తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు తమకు న్యాయం చేయాలని బాధితులు మొర పెట్టుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన సాయిబాబు అనే బాధితుడు మాట్లాడుతూ… ‘డాంకీ ప్యాలెస్’ గురించి చెబితే తాను రూ.56 లక్షలు ఇన్వెస్ట్ చేశానని… తమకు మూడు నెలల పాటు డబ్బులు ఇచ్చారని, కానీ ఆ తర్వాత నుంచి ఇవ్వలేదన్నారు. తమ ఆందోళనపై ఏపీ మంత్రి లోకేశ్ స్పందించాలని కోరారు. తెలంగాణ నుంచి కేటీఆర్ ఈ ఘటనపై స్పందించాలని విజ్ఞప్తి చేశారు.