PM Modi| ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కళాశాలలో పది మంది శిశువులు సజీవ దహనమైన ఘటనపై ప్రధాని మోదీ (PM Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటన హృదయవిదారకంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక అధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
‘‘ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో జరిగిన అగ్ని ప్రమాదం హృదయ విదారకంగా ఉంది. చిన్నారులు సజీవదహం అవ్వవం మనసును కలిచివేసింది. అమాయక పిల్లలను కోల్పోయినవారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ అపార నష్టాన్ని భరించే శక్తిని వారికి ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని పోస్టులో పేర్కొన్నారు.
మరోవైపు ఈ ఘటటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన శిశువుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు చెరో రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు నష్టపరిహారం ప్రకటించారు.
శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కళాశాలలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో మంటలు వ్యాపించడంతో పది మంది శిశువులు సజీవ దహనమయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చేలరేగి ఉంటాయని జిల్లా కలెక్టర్ అవినాశ్‌కుమార్ తెలిపారు. అయితే మంటలు వ్యాపించిన సమయంలో సేఫ్టీ అలారమ్ మోగకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని గుర్తించారు.