Nara Ramamurthy Naidu| ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) సోదరుడు, సినీ నటుడు నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ AIG ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. రామ్మూర్తి మృతితో టీడీపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. ఆయన అంత్యక్రియలు రేపు వారి స్వగ్రామం నారావారిపల్లెలో జరగనున్నాయి అంటూ కుటుంబసభ్యులు తెలిపారు.
కాగా ఇవాళ ఉదయం రామ్మూర్తి నాయడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని హుటాహుటిన విజయవాడ నుంచి హైదరాబాద్ బయల్దేరివెళ్లారు. మరోవైపు ఢిల్లీలో ఉన్న సీఎం చంద్రబాబు కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం పర్యటన రద్దు చేసుకుని హైదరాబద్ పయనమయ్యారు.
ఇటీవలే ఆయన కుమారుడు నారా రోహిత్(Nara Rohit) నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఎంగేజ్మెంట్ జరిగిన కొన్ని రోజులకే తండ్రి చనిపోడంతో నారా వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కాగా రామ్మూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరు హీరో నారా రోహిత్, మరొకరు నారా గిరీష్. అన్న చంద్రబాబు బాటలో టీడీపీలో చేరిన రామ్మూర్తి నాయుడు.. 1994లో టీడీపీ తరఫున చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి గల్లా అరుణ కుమారి చేతిలో ఓడిపోయారు. అనంతరం అనారోగ్య పరమైన కారణాలతో రాజకీయాల నుంచి విరమించుకున్నారు.