తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush)పై, స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara) తీవ్ర విమర్శలు చేశారు. నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన నయనతార డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీ దాన్’ పాటలు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడంపై విమర్శిస్తూ ధనుష్‌కు ఓ బహిరంగ లేఖ రాశారు.
లేఖలో ఏముందంటే..
‘‘తండ్రి, దర్శకుడైన సోదరుడి సపోర్ట్‌తో ఇండస్ట్రీలోకి వచ్చి గొప్ప నటుడైన మీరు దీనిని చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. నాలాంటి ఎంతోమంది వ్యక్తులు మనుగడ కోసం చేసే పోరాటమే సినిమా అని అందరికీ తెలుసు. ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేకుండా ఈ స్థాయికి రావడానికి ఎంతో పోరాటం చేయాల్సి ఉంటుంది. నా జీవితాన్ని ఆధారంగా చేసుకొని రూపొందిన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం నేను మాత్రమే కాదు సినీప్రియులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నా సినీ ప్రయాణం, ప్రేమ, పెళ్లితో పాటు నాతో ఉన్న అనుబంధాన్ని తోటి నటీనటులు పంచుకోవడం వంటి విశేషాలతో ఈ డాక్యుమెంటరీ సిద్ధమైంది. మా జీవితంలో ఎంతో ముఖ్యమైన ‘నానుమ్ రౌడీ దాన్’ మాత్రం ఇందులో భాగం కాకపోవడం చాలా బాధాకరం.
ఈ సినిమాలోని ఫొటోలు, వీడియోలు, పాటలు ఉపయోగించుకోవడానికి సంబంధించిన ఎన్‌వోసీ(NOC) కోసం దాదాపు రెండేళ్ల నుంచి మీతో ఫైట్ చేస్తున్నాం. నెట్‌ఫ్లిక్స్‌లో ఆ కార్యక్రమం రిలీజ్ దగ్గర కానున్న సమయంలో మీ ఆమోదం కోసం ఎదురుచూశాం. చివరకు మేము ఆశలు వదులుకోవాలని నిర్ణయించుకున్నాం. మీరు పర్మిషన్ ఇవ్వకపోవడం నా హృదయాన్ని ముక్కలు చేసింది. డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసిన వెంటనే మీరు పంపించిన లీగల్ నోటీస్ నన్ను షాక్‌కు గురిచేసింది. అందులో మూడు సెకన్ల క్లిప్స్ వాడుకున్నందుకు దాదాపు రూ.10 కోట్లు డిమాండ్ చేయడం విచారకరం. ఇక్కడే మీ క్యారెక్టర్ ఏమిటనేది తెలిసిపోతుంది. మీ నోటీసుకు మేము న్యాయబద్ధంగానే సమాధానం ఇస్తాం. దేవుడే దీనికి సమాధానం చెబుతాడు.
సినిమా విడుదలై దాదాపు 10 ఏళ్లు అవుతున్నా ఒక మనిషి ప్రపంచం ఎదుట ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తాడు. ఈ లేఖతో నేను ఒక విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నా. తెలిసిన వారు విజయాలు అందుకుంటే అసూయ పడకుండా దానిని కూడా సంతోషంగా తీసుకోండి” అని నయనతార రాసుకొచ్చారు. కాగా నయనతార జీవితాన్ని ఆధారంగా చేసుకొని ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్‌ను నెట్‌ఫ్లిక్స్ రూపొందించింది. నవంబరు 18న విడుదల కానుంది.