మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల(Maharashtra Elections)కు మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో అన్ని పార్టీల అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. తాజాగా అమరావతిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బ్యాగులను తనిఖీ చేశారు. అమరావతిలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ల్యాండ్ అవ్వగానే అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఆయన బ్యాగులతో పాటు హెలికాప్టర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు.
అయితే అధికారుల తనిఖీలపై విపక్ష నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బ్యాగులను కూడా అధికారులు పలుమార్లు తనిఖీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయనతో పాటు పలువరు ప్రతిపక్ష నేతలను కూడా చెక్ చేయడంతో.. విపక్ష నేతలను ఈసీ టార్గెట్ చేసిందంటూ విమర్శలు ఊపందుకున్నాయి. ఈ విమర్శలపై ఈసీ స్పందించింది. ఎన్నికల వేళ.. తనిఖీలు చేయడం సాధారణ ప్రక్రియే అంటూ పేర్కొంది.
మరోవైపు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, దేవేంద్ర ఫడణవీస్, కేంద్రమంత్రి అమిత్ షా తదితర ఎన్డీయే నేతల బ్యాగులను కూడా అధికారులు తనిఖీ చేశారు.కాగా 288 శాసనసభ నియోజకవర్గాలున్న మహారాష్ట్రలో నవంబరు 20న ఎన్నికలు జరగనుండగా.. నవంబరు 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి.