మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం(Maharashtra Elections)లో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మజ్లిస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన కొంతమంది దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ మండిపడ్డారు. ఇది ఛత్రపతి శివాజీ పుట్టిన నేల అని.. తమ సహనం పరీక్షించకండని ఒవైసీ సోదరుల(Owaisi Brothers)కు వార్నింగ్ ఇచ్చారు. డెగ్లూరులో జరిగిన ఎన్నికల సభలో పాల్గొన్న పవన్ కల్యాణ్ మరాఠీలో ప్రసంగించారు. తొలుత జై భవానీ, జై శివాజీ, జై మహారాష్ట్ర అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. తాను ఇక్కడికి ఓట్లు అడిగేందుకు రాలేదని, మరాఠా వీరులకు నివాళి అర్పించడానికి వచ్చానని పవన్ తెలిపారు. స్వరాజ్యం అర్థం తెలిపిన నేల, అంబేద్కర్ జన్మించిన నేలపై నివాళులు అర్పించేందుకు వచ్చానని పేర్కొన్నారు.
మరాఠా యోధుల పోరాటంతో పాటు శివాజీ మహరాజ్ పరిపాలన, స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తిని గుర్తుచేసుకోవడానికి వచ్చానని వివరించారు. రాజ మాత జీజీయా భాయ్ నేర్పిన విలువలతో ఈ నేలకు మనస్ఫూర్తిగా నమస్కరించడానికి వచ్చానన్నారు.అధికారంతో సంబంధం లేకుండా మన సిద్దాంతాలకు బలంగా కట్టుబడి ఉండడం బాలా సాహెబ్ ఠాక్రే నుంచి నేర్చుకున్నానని వెల్లడించారు. సనాతన ధర్మం కాపాడటం కోసమే శివసేన, జనసేన పార్టీలు పుట్టాయని పేర్కొన్నారు. సినిమాల్లో పోరాటాలు చేయడం, గొడవ పెట్టడం చాలా ఈజీ అని.. నిజ జీవితంలో ధర్మం కోసం కొట్లాడటం, నిలబడటం చాలా కష్టమని తెలిపారు.