సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో పర్యటించిన ఆయన హిందూస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడటం దారుణమని ఫైర్ అయ్యారు. మహిళలను వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. తమను మాత్రమే కాదని.. సొంత చెల్లి, తల్లిని కూడా బూతులు తిట్టిస్తున్న నేతలను ఏం చేయాలని ప్రశ్నించారు. ఇలాంటి నేతలపై చర్యలు తీసుకోకపోతే ఎలా అని నిలదీశారు. సోషల్ మీడియాలో మహిళలను వేధించే సైకోలను నియంత్రించడానికి కొత్త చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇక ఆయన అరెస్ట్ గురించి మాట్లాడుతూ.. ప్రజల కోసం పనిచేసిన తాను అక్రమ కేసులకు గురికావడం బాధించిందన్నారు. అక్రమ కేసులు పెట్టి 53 రోజులు వేధించారని.. చేయని తప్పునకు శిక్ష అనుభవించానని వాపోయారు. అయినా ఎక్కడా ధైర్యం కోల్పోలేదని తెలిపారు. జైలు జీవితం ప్రజల కోసం మరింత బాధ్యతగా పనిచేయాలనే పట్టుదల తీసుకొచ్చిందన్నారు. ఇక 2029 ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం అవ్వాలనే విషయంపై ప్రధాని మోదీ(PM Modi) ఇప్పటి నుంచే పనిచేస్తున్నారని చెప్పారు. ఏపీలో కూడా 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నామని చంద్రబాబు వెల్లడించారు. తమ కూటమి దీర్ఘకాలం కొనసాగుతుందని స్పష్టంచేశారు.