Pawan Kalyan| మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మహాయుతి కూటమి అభ్యర్థుల తరపున తెలుగు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. పవన్ నిర్వహించిన రోడ్ షోలు, ర్యాలీలకు, బహిరంగ సభలకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. దీంతో మహాయుతి అభ్యర్థుల్లో జోష్ నెలకొంది. ఈ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ కూటమితో పాటు మజ్లిస్ పార్టీపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. హిందూవులంతా ఐక్యంగా కలిసి ఉండాలన్నా.. సనాతన ధర్మం నిలబడాలన్నా బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు.
ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజలు ఎక్కువగా ఉండే సోలాపూర్‌లో నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మీకు తెలుసు కదా తెలంగాణ అంటే నా గుండె ఎలా కొట్టుకుంటుందో.. బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి అంటూ గద్దరన్న పాడిన పాట నాకు ఇష్టమైన పాట.. తెలంగాణ పోరాటాల గడ్డ’ అని తెలిపారు. అనంతరం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయిందని పేర్కొన్నారు.