Kerala| ఆంబులెన్స్ వెళ్తుంటే ఎదురుగా ఉన్న వాహనదారులు ఆగి మరి సైడ్ ఇస్తుంటారు. అందులో పేషెంట్లను సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆంబులెన్స్(Ambulance)కు దారి ఇస్తుంటారు. కానీ కేరళలో మాత్రం ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు. ఆంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా కిలో మీటర్ల మేర ఇబ్బంది పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడగియాలో వైరల్ అవుతోంది.
అసలు ఏం జరిగిందంటే..కేరళలోని ప్రధాన రహదారిపై అతివేగంతో ఆంబులెన్స్ వెళ్తుంది. అయితే ఓ కారు యజమాని మాత్రం ఆంబులెన్స్ డ్రైవర్‌కు చుక్కలు చూపించాడు. హారన్ కొడుతూ పక్కకు వెళ్లమని సిగ్నల్ ఇచ్చినా కారు డ్రైవర్ మాత్రం దారి ఇవ్వకుండా ముందుకు వెళ్తున్నాడు. దీంతో ఆంబులెన్స్ డ్రైవర్ ఈ తతంగాన్ని మొత్తం వీడియో తీశాడు. అనంతరం తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో నెటిజన్లు కారు డ్రైవర్ తీరుపై మండిపడుతున్నారు. అత్యవసరగా వెళ్తున్న వారికి దారి ఇవ్వకుండా ఇదేం పిచ్చి పని అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వీడియో కాస్త కేరళ పోలీసుల దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన పోలీసులు కారు యజమాని గురించి ఆరా తీశారు. కారు నంబర్ ద్వారా యజమాని అడ్రస్ కనుక్కున్నారు. అతడి ఇంటికి వెళ్లిన పోలీసులు ఆంబులెన్స్‌కి ఎందుకు దారి ఇవ్వలేదని విచారించారు. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో రూ.2.50 లక్షలు జరిమానాతో పాటు లైసెన్స్ రద్దు చేశారు. దీంతో పోలీసుల చర్యలను నెటిజన్లు అభినందిస్తున్నారు.