జడ్చర్ల మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా 14వ వార్డు కౌన్సిలర్ కోనేటి పుష్పలత ఎన్నికయ్యారు. మాజీ మంత్రి, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి 14వ వార్డు కౌన్సిలర్ పుష్పలతను జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నుకోవాలని బిఆర్ఎస్ కౌన్సిలర్లకు సూచించడంతో సోమవారం జడ్చర్ల, (కావేరమ్మపేట) మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన ఉప ఎన్నికలో పుష్పలతకు ఎవరు వ్యతిరేకంగా నామినేషన్ వేయక పోవడంతో జడ్చర్ల మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా కోనేటి పుష్పలత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.
జడ్చర్ల గత మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మిపై సొంత పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టడంతో తీర్మానం నెగ్గడంతో ఆమె మున్సిపల్ చైర్ పర్సన్ పదవిని కోల్పోయారు దీంతో నూతన చైర్ పర్సన్ కు ఉప ఎన్నిక అనివార్యం కావడంతో అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసి సోమవారం మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికకు తేదీ ఖరారు చేయడంతో ఒక రోజు ముందు క్యాంపునకు తరలిన బిఆర్ఎస్ కౌన్సిలర్లతో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సమావేశమై అందరితో పుష్పలత ఎన్నికకు ఏకాభిప్రాయం కుదిరించారు. కౌన్సిల్ సభ్యులు మొత్తం 27 మంది సభ్యులకు గాను బిఆర్ఎస్ పార్టీకి చెందిన 23 మంది, కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెందిన నలుగురు ఉండడంతో 14వ వార్డు కౌన్సిలర్ కోనేటి పుష్పలత ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆమెను చైర్ పర్సన్ గా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
మాజీ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి ఉప ఎన్నికకు హాజరై బిఆర్ఎస్ అభ్యర్థి పుష్పలతను చైర్ పర్సన్ గా ఎన్నికకు అనుకూలంగా వ్యవహరించారు. మహబూబ్ నగర్ ఆర్డీవో నవీన్ కుమార్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్న నూతన చైర్ పర్సన్ కోనేటి పుష్పలత మీడియాతో మాట్లాడుతూ నా మీద నమ్మకంతో జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా నియమించినందుకు మాజీ మంత్రి లక్ష్మారెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నానని, వారికి ఎల్లప్పుడు రుణపడి ఉంటానని, తోటి కౌన్సిలర్లు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నేటి నుండి జడ్చర్ల మున్సిపాలిటీ ప్రజలకు, కౌన్సిలర్లకు అందుబాటులో ఉంటూ జడ్చర్ల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. పుష్పలత ఎన్నిక కావడం పట్ల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.