అమ్మాయిలకి జుట్టుపై ఎంత మక్కువ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగాలని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో అందరికీ తెలిసిందే. అలాంటి జుట్టుని స్కూల్ కి ఆలస్యంగా వచ్చారని కత్తిరించేస్తే ఎంత కోపం వస్తుందో కదా. సరిగ్గా ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం (Visakhapatnam)లో దారుణం చోటుచేసుకుంది. ఆలస్యంగా వచ్చారని విద్యార్థినుల జుట్టు కత్తిరించేసిన ఘటన అందరిని షాక్ కి గురి చేస్తోంది.
విశాఖపట్నం (Visakhapatnam ) జిల్లా జి. మాడుగల కేంద్రంలోని కేజీబీవీలో 15 మంది విద్యార్థులు సోమవారం పాఠశాలకు ఆలస్యంగా వెళ్లారు. దీంతో ఆలస్యంగా వచ్చినందుకు పనిష్మెంట్ ఇవ్వాలని హాస్టల్ ఇంచార్జ్ ప్రసన్న కుమారి భావించింది. అయితే వారికి ఆమె విధించిన పనిష్మెంట్ అందరిని ఆగ్రహావేశాలకు లోనయ్యేలా చేసింది. ఆలస్యంగా వచ్చినందుకు ఏకంగా 15 మంది విద్యార్థినుల జట్టు కత్తిరించింది. పాఠశాలకు ఆలస్యంగా వచ్చనంత మాత్రాన జట్టు కత్తిరించడం ఏంటని విద్యార్థినుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఇంచార్జ్ ప్రసన్న కుమారిని విధుల నుంచి వెంటనే తప్పించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.