ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వాటర్ ట్యాంక్ (Water Tank) లో డెడ్ బాడీ కలకలం రేపింది. హరి నగర్ రీసాల గడ్డ వాటర్ ట్యాంక్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం స్థానికుల్ని కలవరపెట్టింది. సోమవారం వాటర్ ట్యాంక్ క్లీన్ చేసేందుకు వచ్చిన సిబ్బంది ట్యాంకులో మృతదేహాన్ని చూసి ఖంగుతిన్నారు. వెంటనే అధికారులకు, పోలీసులకు సమాచారమిచ్చారు.
సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ముషీరాబాద్ సిఐ జహంగీర్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ రవి చారి, వాటర్ వర్క్స్ ఇన్ స్పెక్టర్ వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. ట్యాంక్ పై చెప్పులు కనిపించడంతో అవి మృతునివే అయుండొచ్చని భావిస్తున్నారు. మృతునికి సంబంధించిన ఆనవాళ్లు, చెప్పులను బట్టి అతని వయసు 35 నుండి 40 సంవత్సరాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
మృతదేహాన్ని వెలికితీసేందుకు పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం అక్కడికి చేరుకొని వాటర్ ట్యాంక్ (Water Tank) నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. విషయం బయటకి పొక్కడంతో స్థానికులు వాటర్ ట్యాంక్ వద్దకి భారీగా చేరుకున్నారు. మృతదేహం నుంచి కుళ్ళిన వాసన వస్తుండటంతో ఘటన జరిగి ఎక్కువ రోజులే అయుంటుందని అనుమానిస్తున్నారు. అయితే మృతునిది, ఆత్మహత్యా లేక హత్యా అనేది తెలియాల్సి ఉంది.