మైలార్‌దేవ్‌పల్లి (Mailardevpally) లో సోమవారం ఉదయం బ్లాస్టింగ్ కలకలం రేపింది. లక్ష్మీగూడ వద్ద రాజస్థాన్ పర్జా ప్రతి శ్రీ శ్రీయాదే మాత దేవాలయం ఆవరణలో పేలుడు సంభవించడంతో కొద్దిసేపు భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనలో ఆలయ పూజారి తీవ్రంగా గాయపడడంతో ఆయనని ఆసుపత్రికి తరలించారు.
స్థానిక కథనం ప్రకారం… సోమవారం ఉదయం సుమారు 11 గంటలకు ఆలయం వద్ద పేలుడు సంభవించింది. దేవాలయ ఆవరణలో పూజారి చెత్తను తొలగిస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు పదార్థం బ్లాస్ట్ అయింది. ఈ ప్రమాదంలో పూజారి సుగుణారామ్ కి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం ఆయనని ఆసుపత్రికి తరలించారు.
కాగా, పేలుడు జరిగిన వెంటనే స్థానికులు మైలార్‌దేవ్‌పల్లి (Mailardevpally) పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఎసిపి శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అనంతరం పోలీసు అధికారులు క్లూస్ టీమ్, బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్‌ను రప్పించారు. పేలుడు సంభవించిన ప్రదేశాన్ని ఇరు బృందాలు పరిశీలిస్తున్నాయి.