డబ్బంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. అందులోనూ ఈరోజుల్లో చాలా మంది ఈజీ మనీ కోసం అనేక క్రైమ్స్ కి పాల్పడుతున్నారు. డబ్బు కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడట్లేదు. అలాంటిది ఓ వ్యక్తి రోడ్డుపై తనకి రూ. రెండు లక్షల నగదు దొరికితే నేరుగా పోలీసులకు అప్పజెప్పడం విశేషం కదా.
లాలాపేట కు చెందిన సతీష్ యాదవ్ అనే వ్యక్తి సోమవారం ఉదయం లాలాపేటలోని అయ్యప్ప స్వామి దేవాలయం మీదుగా నడుచుకుంటూ వెళుతున్నాడు. అదే సమయంలో తనకి రోడ్డుపై రూ. రెండు లక్షల రూపాయలు కనబడ్డాయి. వెంటనే స్థానిక కాంగ్రెస్ నాయకుడు కిషోర్ యాదవ్ కు సమాచారం అందజేసి, ఆయన సహాయంతో లాలాగూడ పోలీసులను కలిశాడు. తనకి దొరికిన రూ. రెండు లక్షల రూపాయలు పోలీసులకు అప్పగించి తన నిజాయితీ చాటుకున్నాడు. ఈ సందర్భంగా పోలీసులు ముద్దం సతీష్ యాదవ్, కిషోర్ యాదవ్ లను అభినందించారు.