తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇండస్ట్రీ ప్రముఖులవి కేటీఆర్ ట్యాప్ చేయిస్తే, హరీష్ రావు పొలిటికల్ గా చేశారని సిద్ధిపేట కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్ ఆరోపించారు. ఇదే కేసుకు సంబంధించి గతంలో డీజీపీకి, జూబ్లీహిల్స్ ఏసీబీకి చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. తన ఫోన్ ట్యాప్ అయినట్లు అలర్ట్ మెసేజ్ వచ్చిందని కంప్లైంట్ లో పేర్కొన్నారు. చక్రధర్ గౌడ్ ఫిర్యాదు పై గతంలో రెండుసార్లు పోలీసులు దర్యాప్తు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు తన ఫోన్ ట్యాప్ చేయించినట్లు చక్రధర్ గౌడ్ ఫిర్యాదులో ఆరోపించారు.
చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసు ఫిర్యాదులో భాగంగా సోమవారం మరోసారి విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసిపి ముందు ఈరోజు ఉదయం విచారణకు హాజరైన ఆయన.. తనవద్ద ఉన్న ఉన్న ఆధారాలను అధికారులకు ఇచ్చారు. కాగా, అంతకంటే ముందు ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట మాట్లాడుతూ… తనను గతంలోనూ రెండు సార్లు పోలీసులు పిలిచి వివరాలు తీసుకున్నారని తెలిపారు. ఈ రోజు మళ్ళీ విచారణకు రావాలని పిలిచారని, అందుకే వచ్చానని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రంగనాయక సాగర్ స్కాం బయట పెట్టానని, అందుకే సిద్దిపేటలో హరీష్ ఓడిపోతాడనే భయంతోనే తన ఫోన్ ట్యాప్ చేశాడని చక్రధర్ గౌడ్ ఆరోపించారు. మూవీ ఇండస్ట్రీలో వారి ఫోన్ ట్యాపింగ్ కేటీఆర్ చేయిస్తే, పొలిటికల్ ట్యాపింగ్ హరీష్ రావు చేశాడని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద, సిట్ మీద తనకు నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. హరీష్ రావుని పిలిచి విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తం బయటపడుతుందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వారి మీద అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.