టాలీవుడ్ నటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) గురించి తెలియని వారుండరు. సినీ ఇండస్ట్రీలోనే కాదు, రాజకీయాల పరంగానూ ఆయన స్టైలే వేరు. నేను కమ్మోడినే.. కానీ టీడీపీ కమ్మోళ్లంటే పడదని చెబుతుంటారు. రాష్ట్రంలో కమ్మ డామినేషన్ ఎక్కువైందని చెబుతూ గత పదేళ్లుగా వైసీపీ పక్షాన నిలబడ్డారాయన. వైసీపీ అధినేత జగన్ గురించి ఎవరైనా కామెంట్ చేస్తే ప్రెస్ మీట్ పెట్టి చీల్చి చెండాడేవారు. నారా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వరకు ఎవరినీ వదలరు. ఇప్పుడు వీరిపై ఆయన చేసిన వ్యాఖ్యలే ఆయన్ని కేసులో ఇరికించాయి.
తాజాగా పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) కి ఏపీ సీఐడి షాక్ ఇచ్చింది. ఆయనపై సీఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఏపీ తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై సీఐడి కేసు నమోదు అయింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబుపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాఖ్యలు సీఎం వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు. వర్గాల మధ్య విభేదాలు తలెత్తేలా మాట్లాడిన పోసానిపై చర్యలు తీసుకోవాలని వంశీకృష్ణ సీఐడిని కోరారు. దీంతో సీఐడి అధికారులు పోసాని కృష్ణ మురళి పై కేసు నమోదు చేశారు.