ప్రపంచ స్థాయి లో భారత్ నిలబడడం లో ఇంధిరా గాంధీ పాత్ర కీలకం అన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇందిరాగాంధీ (Indira Gandhi) జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం నెక్లెస్ రోడ్ లోని పివి మార్గ్ వద్ద ఉన్న ఇందిరా గాంధీ విగ్రహానికి భట్టి నివాళులర్పించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… దేశ సమగ్రత కోసం ఇందిరా గాంధీ ప్రాణాలు విడిచారన్నారు. మహిళలకు ఆర్టీసీ లో ఉచిత రవాణా కోసం నెలకు 400 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. త్వరలో మహిళలకు ఇందిరమ్మ రుణాలు ఇవ్వబోతున్నామని తెలిపారు.
కంగనాకి భట్టి కౌంటర్!!
ఇందిరా గాంధీ (Indira Gandhi) పై నెగెటివ్ గా సినిమాలు తీసే వారికి భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. ఇటీవల ఇందిరాగాంధీ పై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీసిన ఎమర్జెన్సీ సినిమా వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇందిరాగాంధీని వక్రీకరించి చూపారని కాంగ్రెస్ వర్గాలు సినిమా రిలీజ్ ని అడ్డుకునేందుకు నిరసనలు, ఆందోళనలు కూడా చేసింది. అయితే ఈ సినిమా గురించే ఇప్పుడు భట్టి విక్రమార్క పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.
దేశ సమగ్రత పై అవగాహన లేని వారు, గతం గురించి తెలియని వారు ఇందిరా గాంధీ చరిత్ర ను వక్రీకరిస్తున్నారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతం గురించి తెలిసిన వారు ఇందిరా గాంధీ కి చేతులు ఎత్తి నమస్కరిస్తారన్నారు. దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు ఇందిరా గాంధీ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్దేశ్యపూర్వకంగా ఇందిరా గాంధీ ని నెగిటివ్ గా చూపిస్తున్నారని భట్టి ధ్వజమెత్తారు.