CAG| కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(CAG) నూతన చీఫ్‌గా తెలుగు ఐఏఎస్ అధికారి నియమితులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన కె.సంజయ్ మూర్తి(K.Sanjay Murthy)ని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1989 బ్యాచ్‌కు చెందిన సంజయ్ మూర్తిని కాగ్ చీఫ్‌గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) నియమించారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 21న సంజయ్ మూర్తి కాగ్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన కేంద్ర విద్యాశాఖలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా విధుల నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం కాగ్ చీఫ్‌గా ఉన్న గిరీష్ చంద్ర ముర్ము(Girish Chandra Murmu) పదవీకాలం నవంబర్ 20తో ముగియనుంది.
అమలాపురం మాజీ ఎంపీ కేఎస్‌ఆర్ మూర్తి (KSR Murthy) కుమారుడైన సంజయ్ మూర్తి (Sanjay Murthy) 1964 డిసెంబరు 24న జన్మించారు. మెకానికల్ విభాగంలో ఇంజినీరింగ్ చదివిన ఆయన 1989 సివిల్స్‌లో హిమాచల్ ప్రదేశ్ కేడర్‌కు ఎంపికయ్యారు. 2002-07 మధ్య కాలంలో కేంద్ర అటవీ, పర్యావరణ, ఐటీ మంత్రిత్వ శాఖల్లో పనిచేశారు.