Patnam Narender Reddy| బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. చర్లపల్లి జైలులో స్పెషల్ బ్యారేక్ ఇవ్వాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. సామాన్య ఖైదీలతో కాకుండా నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారేక్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇంటి భోజనం కూడా అనుమతించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో జైలు అధికారులు ఆయనకు స్పెషల్ బ్యారెక్ కేటాయించనున్నారు. మరోవైపు తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పైనా విచారణ జరగనుంది.
కాగా లగచర్లలో కలెక్టర్, అధికారులపై జరిగిన రాళ్ల దాడిలో పట్నం నరేందర్ రెడ్డి హస్తం ఉందని పోలీసులు ఆరోపించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్కులో వాకింగ్ చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో ఉన్నారు.