Gold loans | ఎవరికైనా అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడు బంగారాన్ని తాకట్టు పెడుతూ ఉంటారు. అయితే ఈ రుణాలను ఒకేసారి చెల్లించే పద్ధతి మాత్రమే ప్రస్తుతం అందబాటులో ఉంది. దీంతో త్వరలోనే బంగారం రుణాలకు కూడా నెలవారీ వాయిదా(EMI) పద్ధతుల్లో చెల్లించే విధానాన్ని అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఉన్నట్లు తెలుస్తోంది. రుణాల మంజూరులో అవకతవకలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇటీవల బంగారం విలువ కట్టే విషయంలో లోపాలు, వేలం పారదర్శకంగా లేకపోవడం వంటివి వెలుగుచూశాయి. అలాగే సంవత్సరానికి వడ్డీ చెల్లించి బంగారం రుణాలను దీర్ఘకాలం కొనసాగించే విధానాన్ని చాలా మంది ప్రజలు అవలంబిస్తున్నట్లు ఆర్బీఐ గుర్తించింది. దీంతో ఈ విధానాలకు చెక్ పెట్టేందుకు బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు కూడా నెలవారీ వాయిదాల విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆర్‌బీఐ ఇటీవల తమ సర్క్యులర్‌లో వెల్లడించినట్లు పలు ఆంగ్ల మీడియా కథనాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలోని బ్యాంకులు దాదాపు రూ. 1.4లక్షల కోట్ల విలువైన బంగారు రుణాలను మంజూరు చేసినట్లు ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఇది 14.6శాతం ఎక్కువ కావడం గమనార్హం.