AP Council| వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులపై శాసనమండలిలో గందరగోళం నెలకొంది. రాష్ట్ర అప్పులపై చర్చ సందర్భంగా ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్(Payyavula Keshav) మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన వివరాలను వెల్లడించారు. వైసీపీ సర్కార్ చేసిన అప్పులు అక్షరాలా 9 లక్షల 74 వేల కోట్ల రూపాయలు అని వివరించారు.
సీఏజీకి ఇచ్చిన లెక్కల ప్రకారం ప్రభుత్వ అప్పులు రూ.4,38,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ రూ.80,914 కోట్లు, కార్పొరేషన్ అప్పులు రూ.2,48,677 కోట్లు, పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ బకాయిలు రూ.36 వేల కోట్లు అని తెలిపారు. రెండు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి శాసనసభ పర్యవేక్షణ లేకుండా డబ్బు ఖర్చు పెట్టారని విమర్శించారు. రాబోయే 25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైసీపీ ప్రభుత్వం కాజేసిందని ఆరోపించారు.
కాగా మంత్రి వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలి ఛైర్మన్ పోడియంను చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభలో రసాభాస నెలకొంది.