నల్గొండ జిల్లాలో పాము కాటుకు గురై మరో గురుకుల విద్యార్థి ఆసుపత్రి పాలైన వార్త తీవ్రంగా కలిచివేసిందని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన… ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పాలనలో బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన పిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రుల్లో చేరుతుండడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
గురుకులాల్లో కుక్కకాట్లు, ఎలుక కాట్లు, పాము కాట్లు సాధారణంగా మారడం దురదృష్టకరం అని హరీష్ రావు (Harish Rao) అన్నారు. విద్యాశాఖ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు తన వద్దనే ఉన్నా ముఖ్యమంత్రి ఏనాడు సమీక్ష చేయడని మండిపడ్డారు. పురుగులన్నం తినలేక విద్యార్థులు ఆకలితో అలమటించినా పట్టించుకోడు. టీచర్లు కావాలంటూ విద్యార్థులు రోడ్డెక్కినా పట్టించుకోడు..
ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినా పట్టించుకోడు. పాముకాట్లు, కుక్క కాట్లు, ఎలుక కాట్లు, కరెంటు షాకులతో ఆసుపత్రుల పాలైనా పట్టించుకోడు” అంటూ సీఎం రేవంత్ పై ఆరోపణలు గుప్పించారు.
Also Read : రూ.1.20 లక్షల జీతంతో సెంట్రల్ బ్యాంక్లో ఉద్యోగాలు
మీ 11నెలల కాలంలో 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.. ఇప్పటికైనా కళ్ళు తెరవండి అని ఎన్నిసార్లు మొత్తుకున్నా సీఎం పట్టించుకోవడం లేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం ఖరీదు 42 మంది విద్యార్థుల ప్రాణాలు అని మండిపడ్డారు. విద్యాశాఖ ప్రక్షాళన అంటూ ప్రగల్భాలు పలకడం కాదు రేవంత్ రెడ్డి.. గురుకులాల్లో కనీస సౌకర్యాలు కల్పించి, విద్యాబోధన జరిగేలా చూడండి అంటూ హితవు పలికారు. అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలు కాపాడండి అని హరీష్ రావు ప్రభుత్వానికి సూచించారు.
పాము కాటుకు గురైన గురుకుల విద్యార్థి
నల్గొండ జిల్లాలో గురుకుల విద్యార్థి పాము కాటుకి గురయ్యాడు. కేతేపల్లి మండలం మూసీ ప్రాజెక్టు దగ్గర గల జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాల వసతి గృహంలో ఉండే గణేష్ అనే విద్యార్థిని పాము కరిచింది. విషయం తెలుసుకున్న పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థిని ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.