RGV|వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(Ramgopal Varma)కు ప్రకాశం జిల్లా పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈనెల 25వ తేదీన ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకి హాజరుకావాలని ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ ఆయనకు నోటీసులు పంపించారు. ఆర్జీవీ వాట్సప్ నంబర్‌కు సంబంధిత నోటీసులు సెండ్ చేశారు. కాగా ముందుగా జారీ చేసిన నోటీసులు ప్రకారం ఈ నెల 19వ తేదీన విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. షూటింగ్‌లో బిజీగా ఉన్నానంటూ నాలుగు రోజులు గడువు కోరారు వర్మ.
తనపై మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ ఆర్జీవీ చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల ముందు ఆర్జీవీ రూపొందిచిన ‘వ్యూహం’ సినిమా ప్రమోషనల్లో భాగంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకావాలంటూ ఆర్జీవీకి పోలీసులు హైదరాబాద్‌లో నోటీసులు అందించిన సంగతి తెలిసిందే.