YS Jagan| రాష్ట్ర అప్పులపై కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెబుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఆరోపించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు(CM Chandrababu)పై తీవ్ర విమర్శలు చేశారు. 2018-19 నాటికి గత టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.3 లక్షల కోట్లు అని.. వాస్తవాలు ఏంటో చంద్రబాబు ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. బడ్జెట్‌లో చెప్పిన లెక్కలు, బయట చెప్పే లెక్కలకు తేడా ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ హామీలపై ప్రజలు నిలదీస్తారనే చంద్రబాబు బొంకుతున్నారని.. అందుకే బొంకుల బాబు అని చంద్రబాబును ఎందుకు అనకూడదు అని ఎద్దేవా చేశారు.
తమ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.4 లక్షల 91 వేల కోట్ల అప్పులు కాగా ప్రభుత్వ గ్యారంటీ అప్పులు రూ.లక్షా 54 వేల కోట్లు మొత్తం కలిపి రూ.6 లక్షల 46 వేల కోట్ల అప్పులు అని పేర్కొన్నారు. అలాగే 2023-24కు సంబంధించి కాగ్ రిపోర్ట్ కూడా ఇదే చెప్పిందని గుర్తు చేశారు. అయినా కానీ చంద్రబాబు రూ.12 లక్షల కోట్లని ఒకసారి.. రూ.14 లక్షల కోట్లని మరోసారి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.2 లక్షల 57 వేల కోట్ల అప్పులు కాగా.. ప్రభుత్వం గ్యారంటీగా ఉన్న అప్పులు రూ.55వేల కోట్లు, మొత్తం కలిపి రూ.3 లక్షల 13వేల కోట్ల అప్పులు అని తెలిపారు. ఎవరి హయాంలో అప్పులు ఎక్కువయ్యాయో లెక్కలే చెబుతున్నాయని జగన్ వెల్లడించారు. తప్పుడు ప్రచారం చేయడం ధర్మమేనా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అనే వ్యక్తి ఎప్పటికీ మారరు అని జగన్ మండిపడ్డారు.