Umpire Injury| క్రికెట్ ఆటలో బ్యాటర్లు, బౌలర్లు, ఫీల్డర్లకు గాయాలు కావడం తరుచుగా చూస్తుంటాం. కానీ ఒక్కోసారి ఫీల్డ్ అంపైర్లకు కూడా గాయాలవుతుంటాయి. తాజాగా ఇలాంటి సంఘటనే ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నీలో చోటు చేసుకుంది. వెస్ట్ ఆస్ట్రేలియన్ సబర్బన్ టర్ఫ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నార్త్ పెర్త్ – వెంబ్లే డిస్ట్రిక్ట్స్ మధ్య థర్డ్ గ్రేడ్ మ్యాచ్‌కు టోనీ డి నోబ్రెగా(Tony de Nobrega)అంపైరింగ్ చేస్తున్నారు. బ్యాటర్ గట్టిగా స్ట్రైయిట్ డ్రైవ్ కొట్టడంతో బంతి బలంగా ఆయన ముఖం మీద తాకింది. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
అయితే ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ముఖమంతా గాయాలయ్యాయి. ఈ సంఘటన నాలుగు రోజుల కిందట చోటుచేసుకోగా.. ఇప్పుడు బహిర్గతం అయింది. డినోబ్రెగా ముఖమంతా వాచిపోయిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. టోనీ త్వరగా కోలుకుని మళ్లీ మైదానంలోకి దిగాలని ఆకాంక్షిస్తున్నామని వెస్ట్ ఆస్ట్రేలియన్ సబర్బన్ టర్ఫ్ క్రికెట్ అసోసియేషన్ (WASTCA) అంపైర్స్ అసోషియేషన్ తెలిపింది. కాగా ఈ ఘటనలో ఫీల్డ్ అంపైర్లకు కూడా హెల్మెట్లు తప్పనిసరి చేయాలని నెటిజన్లు సూచిస్తున్నారు.