రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి రక్షించండి అని వేడుకుంటున్నా… అక్కడున్నవారంతా ఫోన్లలో మునిగిపోయారు. ఫోటోలు, వీడియోలు తీస్తూ… అంబులెన్స్ వస్తుంది ఓపిక పట్టండి అని చెప్తూ ఉన్నారు. చివరికి వారందరి కళ్ళముందే ఓ వ్యక్తి నిస్సహాయ స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియోలు చూసినవారు ఓ మనిషి ప్రాణాపాయ స్థితిలో కాపాడండి, రక్షించండి అని వేడుకుంటుంటే… ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ అంబులెన్స్ కోసం వెయిట్ చేయమనడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధించిన వివరాల్లోకి వెళితే…
హైదరాబాద్ – కీసర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో రాంపల్లి చౌరస్తా వద్దగురువారం ఉదయం రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వరంగల్ జిల్లాకి చెందిన ఎలందర్ (35) అనే వ్యక్తి తాను నిర్మిస్తున్న ఇంటిని చూసేందుకు స్కూటీ పై వెళ్తుండగా వెనుక నుండి వచ్చిన లారీ ఢీ కొట్టి కింద పడ్డాడు. స్థానికులు గమనించి కేకలు పెట్టగా… డ్రైవర్ లారీని ఒక్కసారిగా రివర్స్ చేయడంతో ఎలందర్ రెండు కాళ్లపై నుండి వెళ్ళింది. దీంతో మృతుని రెండు కాళ్ళు నుజ్జు నుజ్జు అయ్యాయి. రక్తం మడుగులో ఉన్న ఎలందర్ నొప్పితో అల్లాడుతూ… తనను కాపాడమని వేడుకున్నాడు. అయినా అక్కడ ఉన్న జనం ఫోటోలు, వీడియోలు తీస్తూ 108 వెహికల్ వచ్చే వరకు గడిపారు. 108 వచ్చి ఆసుపత్రికి తరలించే లోపు ఎలందర్ మృతి చెందాడు. మృతునికి ఇద్దరు చిన్నపిల్లలు, భార్య ఉన్నారు.