AAP| వచ్చే ఏడాది ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi Assembly Election) జరగనున్నాయి. అయితే ఆ ఎన్నికలకు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేసింది. 11 మంది అభ్యర్థుల పేర్లను ఈ జాబితాలో ప్రకటించింది. బీజేపీ నుంచి చేరిన బ్రహ్మ్ సింగ్ తన్వర్, అనిల్ ఝా, బీబీ త్యాగి.. కాంగ్రెస్ నుంచి చేరిన చౌధరీ జుబైర్ అహ్మద్, వీర్ ధింగన్, సుమేశ్ షోకీన్‌లకు ఈ జాబితాలో చోటు కల్పించడం గమనార్హం. వీరితో పాటు సరితా సింగ్, రామ్ సింగ్ నేతాజీ, గౌరవ్ శర్మ, మనోజ్ త్యాగీ, దీపక్ సింఘాల్ కూడా ఉన్నారు.
మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. 2020లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాల్లో 62 స్థానాలను గెలుచుకుని విజయం దుంధుబి మోగించింది.
కాగా లిక్కర్ స్కాంలో ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈసారి జరిగే ఎన్నికలు ఆ పార్టీకి కీలకంగా మారాయి. మరోవైపు బీజేపీ కూడా ఢిల్లీలో పాగా వేయాలని డిసైడ్ అయింది. ఇందుకోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ఆప్ సీనియర్ నేత, మంత్రిగా పనిచేసిన కైలాష్ గెహ్లాట్‌ను పార్టీలో చేర్చుకుంది. దీంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయి.