జైలు నుండి విడుదలైన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) చాలా సైలెంట్ అయిపోయారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఎవరినీ కలవడం లేదు కూడా. సోషల్ మీడియాలోనూ మునుపటిలా యాక్టివ్ గా లేరు. జైలు నుంచి వచ్చిన తర్వాత తన ఇంటి దగ్గర దిగిన ఫోటో, తండ్రిని కలిసిన ఫోటో ఎక్స్ లో షేర్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఈరోజు ఆసక్తికర ట్వీట్ చేశారు.
అఖండ భారతంలో అదానికో న్యాయం… ఆడబిడ్డకో న్యాయమా? అంటూ ప్రధాని నరేంద్ర మోదీని కవిత ఎక్స్ వేదికగా నిలదీశారు. “ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీను అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా? ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా??” అంటూ ప్రశ్నించారు. లంచం, మోసం చేశారనే అభియోగాలపై ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ (Gautam Adani) పై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో ఆమె ఎక్స్ వేదికగా ఇలా స్పందించారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) గతేడాది మార్చ్ 15న అరెస్టయ్యారు. ఈడీ, సీఐడీ కేసుల్లో దాదాపు ఐదు నెలలు ఆమె తీహార్ జైల్లో గడిపారు. రౌస్ అవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టు ఆమె బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం ఆమెకి ఆగస్టులో బెయిల్ మంజూరు చేసింది. రాజకీయ కుట్రలో భాగంగానే బీజేపీ కవితని అరెస్టు చేయించిందని బీఆర్ఎస్ ఆరోపించింది.