వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు(AB Venkateswara Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఏబీ వెంకటేశ్వరరావు, ఆర్పీ ఠాకూర్, యోగానంద్ లాంటి కొందరు విశ్రాంత ఐపీఎస్ అధికారుల్ని జట్టుగా తయారుచేశారు. వీరంతా జిల్లాల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో.. వేదికలపై గట్టిగా నిలదీస్తున్నారో.. వారి పేర్లను టీడీపీ, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సేకరిస్తారు’ అంటూ జగన్ చేసిన విమర్శలకు ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
‘మిస్టర్ జగన్‌రెడ్డి.. నోరు అదుపులో పెట్టుకో.. మాట సరిచేసుకో.. భాష సరిచూసుకో! ఒకసారి ప్రజల విశ్వాసం కోల్పోయినా.. నోరు జారినా.. వాటిని ఎన్నటికీ తిరిగి పొందలేరు. నీలా కుసంస్కారంతో నేను మాట్లాడను. తెరవెనుక బాగోతాలు నడపను. నేనేంటో తలవంచని నా నైజం ఏంటో గడిచిన 5 ఏళ్లలో నువ్వే చూశావ్.’ అని మండిపడ్డారు.
‘‘సర్వీసులో ఉన్నప్పుడు ఎన్నో ఘనతలు సాధించా. జీవితంలో ఎవరి దగ్గరా చేయి చాచలేదని సగర్వంగా చెప్పగలను. జగన్‌రెడ్డీ.. నీకు ఆ దమ్ముందా..? హత్యలు చేసినవాళ్లను నేను అరెస్టు చేస్తే.. హంతకులను నువ్వు వెనకేసుకొస్తున్నావు. నన్ను సాధించడం కోసం అధికారం వెనుక దాక్కొని అనేక ఆరోపణలు చేశావు. ఒక్క ఆరోపణ నిరూపించలేకపోయావు. నిన్ను ఇక్కడ సీబీఐ బోనులో నుంచోబెడితే, లంచాలు తీసుకున్నావని అమెరికాలో కూడా కోర్టులకు ఈడుస్తున్నారు. నేను ఐపీఎస్ అధికారినై ప్రాణాలకు తెగించి దేశసేవ చేశా. మరి నువ్వు..? అవినీతి కోసమే పుట్టావు. ప్రజాజీవనంలో ఉన్నావు. నా పేరెత్తే ముందు, నా గురించి మాట్లాడేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకో. మీడియా సమావేశంలో నా పేరు ప్రస్తావించి నువ్వు వాడిన భాష సంస్కారహీనం’’ అంటూ ఆయన ఫైర్ అయ్యారు.