TG High Court| బీఆర్ఎస్(BRS) పార్టీకి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని.. ఆ అర్హత స్పీకర్‌కు ఉందని ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
కాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అయితే పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్లపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ నేడు తీర్పు వెల్లడిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.