కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఢిల్లీ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విదేశాల నుంచి, జైళ్ల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ముఠాలను నియంత్రించేందుకు ఢిల్లీ పోలీసులు తీవ్రంగా కష్టపడుతున్నారు. డిజిటల్ అరెస్టులతో సహా సైబర్ క్రైమ్ కూడా పోలీసులకు పెద్ద సవాలుగా ఉంది. నేరాల్లో మైనర్‌ల ప్రమేయం కూడా పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఢిల్లీలో శాంతిభద్రతలపై శుక్రవారం ఉదయం అమిత షా సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో హోం సెక్రటరీ, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ తో పాటు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా (Amit Shah) మాట్లాడుతూ… క్రైమ్ కి వ్యతిరేకంగా “జీరో టాలరెన్స్” విధానాన్ని ప్రభుత్వం కలిగి ఉంది, అందువల్ల ఢిల్లీ లో శాంతిభద్రతల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ప్రతి ఢిల్లీవాసి, సురక్షితంగా ఉండేలా చూడడం ప్రతి ఢిల్లీ పోలీసు బాధ్యత అని చెప్పారు.
ప్రజల భద్రతకు సంబంధించిన ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి ప్రచారాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీలో పోలీసులను చుస్తే ఇక్కడి ప్రజలకు భద్రతా భావం కలగాలన్నారు. అలాగే నేరస్థులకు భయం కలిగేలా ఢిల్లీ పోలీసులు సమర్థవంతంగా పని చేయాలని సూచించారు. పిల్లలు, మహిళలు, సీనియర్ సిటిజన్ల, భద్రత ఢిల్లీ పోలీసుల ప్రాధాన్యతగా ఉండాలని అమిత్ షా ఢిల్లీ పోలీసులకు తెలిపారు.