హైదరాబాద్ పర్యటన ముగించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆమెకి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఘనంగా వీడ్కోలు పలికారు. గవర్నర్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
లోక్ మంథన్ లో పాల్గొన్న ముర్ము..
భారతీయ ఆచారాలను, సంప్రదాయాలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. వీటి పటిష్ఠానికి లోక్ మంథన్ చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పదని కొనియాడారు. శుక్రవారం ఉదయం ఆమె హైదరాబాద్ శిల్పారామంలో నిర్వహించిన లోక్ మంథన్ ప్రధాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) మాట్లాడుతూ… లోక్‌మంథన్ కార్యక్రమాన్ని కొనియాడారు. దేశ ప్రజల్లో సాంస్కృతిక, స్వాభిమాన్ భావనను నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రాలను బలోపేతం చేసే దిశగా లోక్ మంథన్ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఇది చాలా మంచి ప్రయత్నమని, ప్రతి ఒక్కరికీ భారతీయ సంస్కృతి, ఆచారాలపై అవగాహన వస్తుందని అభిప్రాయపడ్డారు.
‘‘2018లో రాంచీ వేదికగా జరిగిన లోక్‌మంథన్ కార్యక్రమంలో పాల్గొన్నాను. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పటిష్టత కోసం చేస్తున్న ఈ ప్రయత్నం చాలా గొప్పది. ఇది విజయవంతం కావాలి. ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నా. భిన్నత్వంలో ఏకత్వం అనేది మన భారతీయ సంస్కృతిలో భాగం. ఇది ఇంద్రధనుస్సులోని సౌందర్యాన్ని సూచిస్తుంది’’ అని ముర్ము కొనియాడారు.