CM Revanth Reddy| సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ(Telangana Thalli Statue)ఏర్పాటు పనులను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న కూలీలను పలకరించిన ఆయన.. పనులు జరుగుతున్న తీరు, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
“రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో నాలుగు కోట్ల ప్రజల ప్రేమమూర్తి తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనకు శరవేగంగా జరుగుతోన్న పనులను ఈ రోజు పరిశీలించడం జరిగింది. ఈ పవిత్ర కార్యంలో పాలుపంచుకుంటున్న శ్రమ జీవులతో పనులు జరుగుతున్న తీరు ఇతర అంశాలపై కాసేపు ముచ్చటించడం జరిగింది” అంటూ రాసుకొచ్చారు.
కాగా డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహ ఏర్పాటుకు ఆగస్టు 28న ఆయన భూమిపూజ చేసిన సంగతి తెలిసిందే. నాటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం ప్రకటన చేసిన రోజు కావడంతో పాటు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం భావించారు.