Priyanka Gandhi| కేరళ రాష్ట్రంలోని వయనాడ్(Wayanad) లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ప్రియాంక.. ప్రస్తుతం లక్ష ఓట్లకు పైగా లీడ్‌లో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ ప్రియాంకకు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
కాగా ప్రియాంక సోదరుడు, లోక్‌సభ పక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) 2024 సార్వత్రిక ఎన్నికల్లో వయనాడ్‌తో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథ్ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే ఈ రెండు స్థానాల్లో రాహుల్ విజయకేతనం ఎగరేశారు. కానీ రెండు స్థానాల్లో ఓ స్థానాన్ని వదులుకోవాల్సి రావడంతో ఆయన వయనాడ్ సెగ్మెంట్‌ను వదులుకున్నారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ నేపథ్యంలో తనకు అండగా నిలిచిన వయనాడ్ ప్రజల కోసం తన సోదరి ప్రియాంక గాంధీని బరిలో దింపుతున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉంటే 2019లో సీపీఐ నేత పీపీ సునీర్‌పై 4.3 లక్షల మెజార్టీతో రాహుల్ విజయం సాధించగా.. 2024 ఎన్నికల్లో సీపీఐ నాయకురాలు అన్నీ రాజాపై 3.6లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మరి ఇప్పుడు ప్రియాంక గాంధీ ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుస్తారో వేచి చూడాలి.