Jani Master| ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master)కు సుప్రీంకోర్టు(Supreme Court)లో భారీ ఊరట దక్కింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా అరెస్ట్ అయిన ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఫిర్యాదుదారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ సతీష్ చంద్రలతో కూడిన ధర్మాసనం దానిని డిస్మిస్ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో జానీ మాస్టర్‌కు బిగ్ రిలీఫ్ దక్కింది.
కాగా తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విధితమే. కొన్ని రోజుల తర్వాత ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించారు. ఈ కేసు కారణంగా ఆయనకు వచ్చిన నేషనల్ అవార్డు కూడా రద్దయింది. అక్టోబర్ 24న తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చిన జానీ.. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని తెలిపారు.