Tilak varma| తెలుగు ఆటగాడు తిలక్ వర్మ టీ20ల్లో దుమ్మురేపుతున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇటీవల సౌతాఫ్రికా జట్టుపై రెండు సెంచరీలు బాదిన ఈ వర్మ.. తాజాగా మరో సెంచరీ బాదాడు. దేశవాళీ టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ టోర్నీలో మేఘాలయ జట్టుతో జరిగిన మ్యాచులో బౌండరీలు, సిక్సర్లతో అదరగొట్టాడు.
హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న తిలక్ వర్మ.. కేవలం 67 బంతుల్లోనే 14 ఫోర్లు, 10 సిక్సర్లతో 151 పరుగులు చేశాడు. దీంతో టీ20ల్లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా ఈ టోర్నీలో అత్యధిక వ్యక్తిగ స్కోరర్ శ్రేయస్ అయ్యర్(147) రికార్డును కూడా అధిగమించాడు. అలాగే టీ20ల్లో 150కి పైగా పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గానూ క్రెడిట్ కొట్టాడు.
ఈ మ్యాచులో తిలక్ వర్మతో పాటు ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (55), రాహుల్ బుద్ది (30) రాణించడంతో హైదరాబాద్ 248/4 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో మేఘాలయ 69 పరుగులకే కుప్పకూలింది. దీంతో హైదరాబాద్ జట్టు 179 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.