మహారాష్ట్ర ఎన్నికల్లో (Maharashtra Elections) ఎన్డీయే కూటమి మహాయుతి విజయం పై సీఎం ఏక్ నాథ్ షిండే (CM Eknath Shinde) స్పందించారు. ఇది ట్రైలర్ మాత్రమే ముందుంది సినిమా అంటూ సినిమా డైలాగులు చెప్పారు. “నేను డాక్టర్ ని కాదు, అయినా ఏడాదిన్నర క్రితం ఒక ఆపరేషన్ చేశాను. కుట్లు వేయకుండానే ఆపరేషన్ జరిగింది. అంతకంటే ఏమీ చెప్పలేను. ఇది ట్రైలర్ మాత్రమే సినిమా ఇంకా రావాల్సి ఉంది” అంటూ తాను గతంలో ఠాక్రే వర్గం నుంచి బయటకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.
ఇక మహారాష్ట్ర ప్రజలకు సీఎం ఏక్ నాథ్ షిండే (Eknath Shinde) ధన్యవాదాలు తెలిపారు. కూటమికి ఓట్లు వేసి గెలిపించిన రైతులు, యువతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు మహాయుతి ఘన విజయానికి కారణం అయ్యాయని చెప్పారు. కూటమినేతలు ఈరోజు సాయంత్రం సమావేశమై కొత్త ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చిస్తామని వెల్లడించారు. కూటమి విజయానికి సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్షగా నిలిచాయని ఆయన అభిప్రాయపడ్డారు
కాగా, ప్రస్తుతం మహారాష్ట్ర ఓట్ల లెక్కింపులో ఎన్డీయే కూటమి మహాయుతి ఆధిక్యంలో ఉంది. భారీ విజయం వైపు అడుగులేస్తోంది. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఒక పార్టీ లేదా కూటమి 145 సీట్లు గెలవాలి. మధ్యాహ్నం 2 గంటల వరకు వెలువడ్డ ఫలితాల ప్రకారం మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసి 216 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇండి అలయన్స్ మహావికాస్ అఘాడీ 55 స్థానాల్లో, ఇతరులు 17 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.