CM Revanth Reddy| తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ(Delhi) వెళ్లనున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానంతో కీలక అంశాలపై చర్చించేందుకు హస్తిన పర్యటనకు వెళ్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7నాటికి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలపై హస్తం పెద్దలతో చర్చించనున్నారు. అలాగే ఈ ఉత్సవాలకు హాజరుకావాలని వారిని కోరనున్నారు.
ఇక రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహం డిసెంబర్ 9న ఆవిష్కరించనున్నారు. దీంతో విగ్రహం ఏర్పాటు సభకు హాజరుకావాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ విపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. అలాగే మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ పదవులపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా సందర్భంగా మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న ఆరు పదవులను భర్తీ చేయాలని కోరనున్నట్లు చెబుతున్నారు. పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పాటైతే పాలనలో మరింత సౌలభ్యంగా ఉంటుందని వివరించనున్నారట.