Naga Chaitanya| యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య త్వరలోనే రెండో పెళ్లి చేసుకోనున్నారు. నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala)ను ఆయన వివాహమాడనున్నారు. ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు కాబోయే సతీమణి గురించి చైతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెతో జీవితం పంచుకునేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
శోభితతో పెళ్లి గురించి చైతూ మాటల్లోనే..
“మా పెళ్లి చాలా సింపుల్, సంప్రదాయబద్ధంగా జరగనుంది. ఈవేడుకల్లో ఆర్భాటాలకు తావులేదు. ఉత్సాహంగా పనులు జరుగుతున్నాయి. గెస్ట్ లిస్ట్, పెళ్లికి సంబంధించిన ఇతర విషయాలను ఇద్దరం కలిసి నిర్ణయిస్తున్నాం. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకం. స్టూడియోలోని తాతగారి విగ్రహం ఎదురుగా మా పెళ్లి జరగనుంది. ఆయన ఆశీస్సులు మాపై ఎప్పుడూ ఉండాలనే ఉద్దేశంతో ఇరు కుటుంబాలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఆమెతో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఆశగా ఎదురుచూస్తున్నా. తనతో నేనెంతగానో కనెక్ట్ అయ్యా. తను నన్ను బాగా అర్థం చేసుకుంది. నా జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని తను పూడుస్తుందని నమ్ముతున్నాను” అని తెలిపారు.
కాగా నాగచైతన్య – శోభితా ధూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4న హైదరాబాద్‌లో జరగనుంది. కుటుంబసభ్యులు, సన్నిహితులు, కొద్ది మంది సినీ ప్రముఖుల సమక్షంలో పెళ్లి చేయనున్నట్లు నాగార్జున వెల్లడించారు. పెళ్లి పనులు వాళ్లిద్దరే చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం చైతూ ‘తండేల్’ సినిమాలో నటిస్తున్నారు.