తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం లోని లగచర్లకు నేతలు ఎవరూ వెళ్లకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అయినా కాంగ్రెస్ తీరు మార్చుకోవాలని సూచించారు. లగచర్లలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం అబద్దాలు చెబుతున్నారన్నారు.
ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నట్లు జూలై 19న ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిందని హరీష్ రావు (Harish Rao) వెల్లడించారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో పారిశ్రామిక కారిడార్ అని మాట మారుస్తున్నారని విమర్శించారు. నిజాన్ని నిర్భయంగా అంగీకరించి పాత గెజిట్ ను ఉపసంహరించుకోండి అని ప్రభుత్వానికి సూచించారు.
అబద్ధాలు మానేసి ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో కొత్త గెజిట్ ను విడుదల చేస్తేనే లగచర్ల ప్రజలు సీఎం మాటలు నమ్ముతారని హరీష్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై గతంలో గోబెల్స్ ప్రచారం చేసిన కాంగ్రెస్, ఇప్పుడు అదే ప్రాజెక్టు నుంచి 20 టీఎంసీల మంచినీటిని హైదరాబాద్ కి తీసుకెళ్తామని చెప్పి టెండర్లకు పిలవమని చెబుతోంది అన్నారు. కాళేశ్వరం కూలిపోతే మరి ఆ ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎలా తీసుకెళ్తామంటున్నారని హరీష్ రావు ప్రశ్నించారు.