BRS Mahadharna | బలవంతపు భూసేకరణ, అణచివేతకు గురవుతున్న దళిత, గిరిజన రైతులకు అండగా ఉంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. గిరిజన, దళిత, పేద రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ సోమవారం మహబూబాబాద్ మానుకోటలో మహాధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి రైతులకు ద్రోహం చేశారని, ప్రజా సంక్షేమం కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు.
మానుకోట తహశీల్దార్ కార్యాలయం దగ్గర జరిగిన బీఆర్ఎస్ మహాధర్నా (BRS Mahadharna) ని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్‌ఎస్ పోరాటాన్ని కొనసాగిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన లగచెర్లలో గిరిజన రైతులు అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారన్నారు. “భూసేకరణకు వ్యతిరేకంగా తొమ్మిది నెలలుగా అక్కడి రైతులు నిరసనలు చేస్తున్నా సీఎంకి వారిని కలవడానికి సమయం లేదు. ఆయన వారి సమస్యలను పరిష్కరించడం మానేసి 28 సార్లు ఢిల్లీకి వెళ్లాడు అని మండిపడ్డారు.
Also Read : MLC Kavitha : బీసీల కోసం రాజ్యాంగ సవరణ జరగాలి
ఫార్మా విలేజ్ ఎవరి కోసమని కేటీఆర్ ప్రశ్నించారు. తన అల్లుడు కోసం రేవంత్ రెడ్డి పేదవాళ్ళ భూములను లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఈ సీఎం తన సొంత అల్లుడు, అదానీ, అన్న, తమ్ముని కోసం తప్ప రాష్ట్ర ప్రజల కోసం పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతు బంధు, 24 గంటల కరెంటు వంటి హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని, కార్పొరేట్ ప్రయోజనాల కోసం ప్రభుత్వం రైతులను దోపిడీ చేస్తోందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ (BRS) నాయకులను తప్పు చేయకపోయినా అరెస్ట్ చేస్తున్న పోలీసులు… మహాధర్నా (Mahadharna) చేస్తున్నందుకు తనపై, ఇతర బీఆర్‌ఎస్ నేతలపై రాళ్లు రువ్వుతామని బెదిరించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ… “14 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపుకి కారణమైన ఈ మానుకోట.. నేడు దళితులు, బీసీలు, గిరిజనులను అణచివేసే వారిపై ప్రతిఘటనకు కోటగా నిలుస్తోంది’’ అని కేటీఆర్ వెల్లడించారు. అన్యాయం ఇలాగే కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతామని, మొత్తం 119 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.