స్కిల్ యూనివర్సిటీ (Skill University)కి అదానీ ఇస్తానన్న రూ. వంద కోట్లను తెలంగాణ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయొద్దని అదానీ గ్రూప్ కి లేఖ రాశామని స్పష్టం చేశారు. సోమవారం ఆయన జూబిలీహిల్స్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు, ముఖ్య నేతలతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (Young India Skill University)కి అదానీ ఇస్తానన్న అదానీ సంస్థ నుంచి రూ.100 కోట్లు స్వీకరించొద్దని నిర్ణయం తీసుకున్నాం అని ప్రకటించారు. ప్రస్తుతం అదానీ గ్రూప్ నేరారోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. టెండర్లను చట్టబద్ధంగా పోటీపడి గెలుచుకోవాలని రాహుల్ గాంధీ చెప్పారన్నారు. పోటీపడే వారిలో అదానీ, అంబానీ, టాటా, బిర్లా ఎవరైనా ఉండొచ్చని వివరించారు. అనవసర వివాదాల్లోకి తెలంగాణ ప్రభుత్వాన్ని లాగొద్దని ప్రతిపక్షాలకి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.