KTR| తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఫార్మాసిటీకి ప్రభుత్వం భూములు లాక్కుంటుందన్న భయంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామంలో ఎలాంటి అవాంఛీనయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తు మధ్యనే సర్పంచ్ సాయిరెడ్డి అంతిమయాత్ర జరిగింది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
“ఇదేనా ఇందిరమ్మ రాజ్యం. ప్రజా పాలనా అంటే? అని ప్రశ్నించారు. ఒక మాజీ సర్పంచ్.. 85 ఏండ్ల పెద్ద మనిషి ఇంటికి అడ్డంగా గోడ కట్టి తొవ్వ లేకుండా చేసి, క్షోభ పెట్టి, ఆత్మహత్య చేసుకునే దుస్థితిలోకి నెట్టేసి, ఆఖరికి అంతిమ యాత్రకు కూడా ఆంక్షలు పెట్టడమా” అని ఆయన మండిపడ్డారు.