Rajya Sabha| ఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు డిసెంబర్ 10ని తుది గడువుగా ప్రకటించింది. ఇకక డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన, 13వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం కల్పించింది. డిసెంబర్ 20న ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది.
రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్యల రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 164 మంది కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు. వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఒక్క రాజ్యసభ అభ్యర్థి విజయం సాధించాలన్నా కనీసం 25 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. దీంతో వైసీపీ రాజ్యసభ బరిలో నిలిచేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మూడు స్థానాలను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకోవడం లాంఛనమే. కాగా ఏపీతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానా రాష్ట్రాల్లో కూడా ఒక్కో స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.