మిషన్ భగీరథ (Mission Bhagiratha) తాగు నీటిపై ప్రజలకు విశ్వాసం, అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క (Minister Seethakka) అధికారులను ఆదేశించారు. వేల కోట్లు ఖర్చు చేసి మిషన్ భగీరథ వ్యవస్థను ఏర్పాటు చేసినా… ప్రజలు ఇంకా ఆర్వో ప్లాంట్లు, బోరు నీళ్ల పై ఆధారపడటం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణ సచివాలయంలో మంత్రి సీతక్క కార్యాలయంలో బుధవారం మిషన్ భగీరథ బోర్డు సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో మంత్రి సీతక్క (Minister Seethakka) మాట్లాడుతూ.. మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న తాగు నీటిపై ప్రతి గ్రామ పంచాయితీలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆర్వో నీరు, బోరు నీటి ద్వారా దీర్ఘకాలంలో ఏ విధమైన సమస్యలు తలెత్తుతాయో ప్రజలకు వివరించాలని సీతక్క అధికారులకు సూచించారు. ప్రజలు విధిగా మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న తాగు నీటిని వినియోగించేలా ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహించాలని చెప్పారు.
మిషన్ భగీరథ నీటి నాణ్యతను ప్రజలకు వివరించేలా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు సదస్సులు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. రాబోయే వేసవి కాలంలో తాగు నీటి సమస్యలు తలెత్తకుండా ఫిబ్రవరి, మార్చి మాసాల్లో క్రాష్ ప్రోగ్రాం నిర్వహించి డిపార్ట్ మెంట్ అధికారులను, పంచాయతీలను సన్నద్దం చేయాలని సీతక్క ఆదేశించారు. మిషన్ భగీరథ బోర్డు సమావేశంలో మంత్రి సీతక్క తోపాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్, మిషన్ భగీరథ ENC కృపాకర్ రెడ్డి, బోర్డు ఇతర డైరెక్టర్లు హజరయ్యారు.