Eknath Shinde| మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నాలుగు రోజులుగా సీఎం అభ్యర్థి ఎంపికపై ఢిల్లీ వేదికగా తీవ్ర మంతనాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ కీలక నేతలతో మాజీ సీఎం ఏక్‌నాథ్ షిండే సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎంపికపై ప్రధాని మోదీ(PM Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah)లదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు.
అలాగే ప్రభుత్వ ఏర్పాటులో అడ్డంకిగా తాను ఉండబోనని తేల్చిచెప్పారు. బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. రేపు(గురువారం) ఢిల్లీలో మహారాష్ట్ర సీఎం అభ్యర్థి పేరును ప్రకటిస్తారని షిండే పేర్కొన్నారు. తన దృష్టిలో సీఎం అంటే కామన్ మ్యాన్ అన్నారు. సామాన్య రైతు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చానని.. ప్రజల కష్టాలన్నీ తెలుసన్నారు. మహిళలు, రైతులు, యువత ఇలా అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు తీసుకొచ్చామని వ్యాఖ్యానించారు. సీఎంగా ఎటువంటి అసంతృప్తి లేదని.. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలు తనకు అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. కాగా మహారాష్ట్ర సీఎంగా మాజీ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ప్రకటిస్తారని తెలుస్తోంది.