‘చెత్త నుంచి సంపద పేరిట’ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ చేపట్టిన పర్యావరణ హిత చర్యలను ప్రశంసిస్తూ ప్రముఖ బహుళజాతి కంపెనీ ఐటీసీ లిమిటెడ్ ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందజేసింది. గీతంలో వినియోగించిన (వృధా) కాగితం, పుస్తకాలను ఒకచోట చేర్చి, వాటిని పునర్వినియోగం కోసం ప్రతియేటా ఐటీసీకి పంపడం ఆనవాయితీగా వస్తోంది. అలా 2023-24 సంవత్సరంలో 9,380 కిలోల కాగితపు వ్యర్థాలను పునర్వినియోగం కోసం పంపగా, తద్వారా ఏడు క్యూబిక్ మీటర్ల పల్లపు స్థలం, 65,525 కిలోల నీరు, 37,443 యూనిట్ల విద్యుత్, 11 మీటర్ల కర్బన ఉద్గారాలు (కార్బన్ డై ఆక్సైడ్) తగ్గడానికి గీతం సహకరించినట్టు ఆ ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు.
ఈ అవార్డును ఐటీసీ లిమిటెడ్ పేపర్ బోర్డ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (హెచ్ఆర్ అండ్ సీఎస్ఆర్) సిబ్ శంకర్ బందోపాధ్యాయ, ఎంఏఆర్ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.మురళి స్వయంగా సంతకం చేసి ఇవ్వడం విశేషం.
స్థిరమైన వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతులను ప్రోత్సహించడంలో గీతం చురుకైన పాత్రను గుర్తించడం తమకు గర్వకారణమని బందోపాధ్యాయ వ్యాఖ్యానించారు. రీసైక్లింగ్ (పునర్ వినియోగం), పర్యావరణ పరిరక్షణ పట్ల గీతం అంకితభావం ఐటీసీ వావ్ స్ఫూర్తికి ఉదాహరణగా నిలుస్తుందని, ఇది మనదేశాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంగా మార్చడానికి దశాబ్ద కాలం తాము చేస్తున్న కృషికి ఊతమిస్తోందన్నారు.
ఐటీసీ వావ్ అనేది వ్యర్థాలు ఉత్పత్తయ్యే చోటే వాటిని తడి, పొడి చెత్తగా విభజించి, పునర్ వినియోగం, పునరుద్ధరణ ద్వారా ఘన వ్యర్థాలను నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్న ఒక మార్గదర్శక కార్యక్రమంగా బందోపాధ్యాయ వివరించారు. దాదాపు దశాబ్ద కాలంగా ఐటీసీ గ్రూపు బెంగళూరు, మైసూరు, హైదరాబాదు, కోయంబత్తూర్, చెన్నై, ఢిల్లీతో సహా ప్రధాన నగరాలలో సుస్థిరత కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని, దాదాపుగా యేడాదికి 64 వేల మెట్రిక్ టన్నుల పొడి వ్యర్థాలను సేకరిస్తోందని తెలిపారు.
తద్వారా 17,750 మందికి పైగా వ్యర్థ పదార్థాల నిర్వహణదారులకు స్థిరమైన జీవనోపాధిని కల్పిస్తోందని, 57 లక్షల మంది బడికెళ్లే బాలల్లో దీనిపై చైతన్యం తీసుకొచ్చామని, దాదాపుగా 2.2 కోట్ల మంది పౌరులు వ్యర్థాల నిర్వహణలో స్థిరమైన పద్ధతులను అవలంబిస్తున్నట్టు బందోపాధ్యాయ పేర్కొన్నారు. తమ ఈ చొరవ పచ్చదనం, పరిశుభ్రమైన భవిష్యత్తు కోసమేనని ఆయన స్పష్టం చేశారు.