ఇటీవల గురుకులాల్లో తరచూ కలుషిత ఆహరం తిని విద్యార్థులు ఆసుపత్రి పాలవడం, ఇప్పటి వరకు 40మందికి పైగా విద్యార్థులు మృతి చెందడం ఆందోళనకరంగా మారింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటానికి దిగింది. ఈ నెల 30 వ తేదీ నుంచి 7 వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ గురుకుల బాట (Gurukula Bata) కార్యక్రమం చేపడుతున్నట్టు కేటీఆర్ ప్రకటించారు.
గురుకుల బాట (Gurukula Bata) కార్యక్రమంలో భాగంగా గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నేతలు పరిశీలించనున్నారు. అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్ తరఫున అధ్యయన కమిటీ వేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో బీఆర్ఎస్ గురుకుల అధ్యయన కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ నివేదికను పార్టీకి సమర్పిస్తుంది. ఈ నివేదిక అంశాలను అసెంబ్లీలో లేవనెత్తేందుకు బీఆర్ఎస్ నిర్ణయించింది.