YS Sharmila| విజయవాడలోని రాజ్ భవన్‌లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను వైఎస్ షర్మిల కలిశారు. అదానీ(Adani), జగన్(Jagan) మధ్య జరిగిన రూ.1750 కోట్ల ముడుపుల వ్యవహారంపై దర్యాప్తు చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అదానీతో డీల్ కోసం రాబోయే 25 ఏళ్లకు ప్రజలను తాకట్టు పెట్టారని విమర్శించారు. సెకీతో గుజరాత్ రూ.1.99 పైసలకు ఒప్పందం చేసుకుంటే.. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం రూ.2.49 పైసలకు ఒప్పందం చేసుకుందని విమర్శించారు. ఈ డీల్ వల్ల ప్రజలపై లక్షల కోట్ల భారం పడుతుందన్నారు. తాను అవినీతి చేయకపోతే తన బిడ్డల మీద జగన్ ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.
అమెరికా ద్వారా ముడుపుల వ్యవహారం ప్రపంచానికి తెలియడం సిగ్గుచేటన్నారు. అంతర్జాతీయ స్థాయిలో మన పరువు పోయిందని మండిపడ్డారు. అదానీ దేశం పరువు తీయగా.. వైఎస్ జగన్ రాష్ట్రం పరువు తీశారని విమర్శించారు. అదానీపై అమెరికాలో చర్యలకు అక్కడి కోర్టులు.. అరెస్టులకు పోలీసులు సిద్ధమవుతున్నా కేంద్ర ప్రభుత్వం కనీసం ఒక్క చర్య కూడా తీసుకోవడం లేదని ఫైర్ అయ్యారు. అలాగే ఏపీలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) కూడా చర్యలకు వెనకడుగు వేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌తో అదానీ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తారా లేదా? అని ప్రశ్నించారు. జగన్ అవినీతిపై దర్యాప్తుకు చంద్రబాబుకు మనసు రావడం లేదని ఆమె మండిపడ్డారు. జగన్ ముడుపులు తీసుకున్నారని అన్ని ఆధారాలు ఉన్నాయని.. వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను షర్మిల డిమాండ్ చేశారు.