Friday, November 29, 2024
Homeఆంధ్రప్రదేశ్YS Sharmila: జగన్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి: షర్మిల

YS Sharmila: జగన్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి: షర్మిల

YS Sharmila| అబద్ధాలను అందంగా అల్లటంలో మాజీ సీఎం జగన్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఏపీసీసీ చీఫ్‌ షర్మిల ఎద్దేవా చేశారు. అదానీతో విద్యుత్ కొనుగోళ్లు ఒప్పందం విషయంలో తనను సన్మానించాలంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆమె ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఈమేరకు ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.

- Advertisement -

“అబద్ధాలను అందంగా అల్లటంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. శాలువలు, సన్మానాలు, అవార్డులు కోరుకొనే ముందు జగన్ గారు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.

2021, మే నెలలో సెకీ వేసిన వేలంలో యూనిట్ ధర గరిష్టంగా రూ.2.14 పైసలు ఉంటే, తమరు రూ 2.49 పైసలకు కొన్నందుకు శాలువలు కప్పాలా ? అదానీ వద్ద గుజరాత్ రాష్ట్రం యూనిట్ ధర రూ 1.99 పైసలకే కొంటే.. అదే కంపెనీ నుంచి 50పైసలు ఎక్కువ పెట్టి, రూ.2.49 పైసలకు కొన్నందుకు మీకు సన్మానాలు చేయాలా ? అదానీతో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుంటే.. ఆగమేఘాల మీద ఒప్పందానికి మీరు ముందుకు వచ్చినందుకు మీకు అవార్డులు ఇవ్వాలా ?

రాష్ట్ర ప్రభుత్వం సోలార్ పార్కులకు టెండర్లు పిలిస్తే, యూనిట్ ధర రూ.2.49 పైసలకు ఎన్టీపీసీ, టాటా పవర్ సప్లయ్ చేస్తామని ముందుకు వచ్చినా వాటి అగ్రిమెంట్లు ఎందుకు రద్దు చేశారు? ట్రాన్స్మిషన్ ఛార్జీల భారం అక్కడ ఇక్కడ లేకుంటే గుజరాత్‌కి ఇచ్చిన రేటు ప్రకారం ఏపీకి రూ 1.99 పైసలకు అదానీ ఎందుకు ఇవ్వలేదు ? రూ.2.49 రేటుకు మీరెందుకు ఒప్పుకున్నారు ? ట్రాన్స్మిషన్ ఛార్జీలు గరిష్ఠంగా యూనిట్ రూ.1.70 పైసలు పడతాయని మీ హయాంలోనే ఇంధన శాఖ చెప్తుంటే ఎటువంటి ఛార్జీలు లేవని చెప్పే మీ మాటలు శుద్ధ అబద్ధం కాదా ? ఒక ముఖ్యమంత్రిని ఒక వ్యాపారవేత్త అధికారికంగా కలిస్తే గోప్యత పాటించడం దేశంలో ఎక్కడైనా ఉందా ? దమ్ముంటే జగన్ మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి.

అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన రిపోర్ట్ లో నా పేరు ఎక్కడుందని బుకాయించే జగన్ గారు.. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అంటే ఆనాడు మీరు కారా.. ఆ కుర్చీలో మీరు కాకుండా మిమ్నల్ని నడిపించే వాళ్లు కూర్చున్నారా..? ఇదేం ఆఫ్ బేస్ట్ నాలెడ్జ్ ? ఇదేం అహంకారపు తిరస్కరణ సమాధానం..? మీరు అవినీతి చేశారని చెప్పింది మేము కాదు. అమెరికా అధికారిక దర్యాప్తు సంస్థలు FBI, SEC స్వయంగా రిపోర్ట్ ఇచ్చాయి. సోలార్ పవర్ ఒప్పందాల్లో రూ.1750 కోట్లు AP చీఫ్ మినిస్టర్‌కి ఇచ్చారని తమ దర్యాప్తు లో కుండబద్దలు కొట్టాయి. ముడుములు ముట్టాకే ఒప్పందాలు చేసుకున్నారని ఓ వంద పేజీల రిపోర్ట్ కూడా ఇచ్చాయి. వివిధ సోర్స్ ల నుంచి సాక్ష్యాలు, ఆధారాలు సమీకరించాం అని రిపోర్ట్ లో స్పష్టంగా పేర్కొన్నాయి.

నిజంగా అదానీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి లేకుంటే, అదానీతో రహస్య ఒప్పందాలు జరగకుంటే, అమెరికా దర్యాప్తు సంస్థలు మీ మీద తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే, మీరు అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదు అని బైబిల్ మీద ప్రమాణం చేయండి. దమ్ముంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఈ సవాల్‌ను స్వీకరించాలి” అంటూ ఆమె ఛాలెంజ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News